Sunday, May 8, 2011

Bobby Jindal Statement-SAKSHI

అమెరికాలోనే పుట్టా: బాబీ జిందాల్
వాషింగ్టన్: అమెరికాలోని లూసియానా రాష్ట్ర గవర్నర్, భారత సంతతి రాజకీయ నేత బాబీ జిందాల్ తన జన్మస్థలంపై తలెత్తిన వివాదానికి బర్త్ సర్టిఫికెట్ విడుదల చేసి తెరదింపారు. తాను 1971 జూన్ 10న అమెరికాలోని బేటన్ రోగ్‌లో, భారత్ నుంచి వలసవచ్చిన దంపతులకు జన్మించానని అందులో తెలిపారు. ఈమేరకు ఆయన కార్యాలయం శనివారం వెల్లడించింది. జిందాల్ జన్మస్థలంపై ఇటీవల ఓ స్థానిక పత్రిక తన సంపాదకీయంలో అనుమానం వ్యక్తం చేసింది. జిందాల్ వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన పుట్టిన ఊరు వివాదం అడ్డంకి కావచ్చని పేర్కొంది.

అమెరికా సెనేటర్ డేవిడ్ విటర్ ఇటీవల సభలో ప్రవేశపెట్టిన జన్మహక్కు పౌరసత్వ బిల్లు చట్టంగా మారితే అది జిందాల్ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపుతుందని చెప్పింది. దీంతో జిందాల్ తన జనన ధ్రువీకరణ పత్రాన్ని విడుదల చేశారు. నిజానికి ఆయన తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. అయితే ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జన్మస్థలంపై కొనసాగుతున్న వివాదానికి ఇటీవల బర్త్ సర్టిఫికెట్ విడుదల చేసి ముగింపు పలకడం తెలిసిందే.

No comments: